Saturday, March 6, 2010

తరగని సౌందర్య రహస్యం


చాల మంది నన్ను అడుగుతుంటారు అన్నా , నీవు ఎందుకు అందరికి సహాయం చేయాలని చూస్తుంటావు? తమ్ముడు నీకు ఎందుకు అంత అభిమానం అని?,
బాబు నీకు ఎందుకు అంత ఖర్మ అని? , ఎందుకు నీకు అంత ఇంట్రెస్ట్ అని. అంత అమాయకత్వం పనికి రాదు అని సలహాలు ఇచ్చిన వాళ్ళు లేకపోలేదు.
ఐతే నా సమాదానం ఒక్కటే .

నాకు లాగ ఇంకొకరు కష్టపడకూడదు అని.
యెవరి సహాయం లేనప్పుడు ఉండే బాధ, పడే కష్టాలు నాకు బాగా తెలుసు.

నాకు ఎవ్వరు సహాయం చేయలేదు. ఆ చేదు అనుభవం ఇంకొకరికి రాకుండా నాకు చేతనైనంతలో నా శక్తి మేరకు చేయూత నందిస్తాను.


చదవడానికి ఒక మంచి కొటేషన్ లాగా వున్నా ఇది పచ్చి నిజం.

సహాయం చేసిన వాళ్ళు వున్నా వారి సంఖ్యా అతి స్వల్ఫం.

మొదట్లో నాకు ఒక విధమైన ఆత్మ న్యూనత భావం.
నన్ను ఎవ్వరు ఇష్టపడరు. నేనంటే ఎవ్వరికీ ఇష్టం లేదు.
ఈ విధమైన భావనలో వున్నన్ని రోజులు నా భావన ,నా తలంపులు నాకు సరి అయినవి గానే అనిపించేవి. బహుశా బాహ్య సౌందర్యం కూడా ఒక విధంగా ఇందుకు ఒక కారణం కావచ్చు . ఇది కేవలం ఒక కారణం మాత్రమే. అయితే ఇదే ప్రధాన కారణం కాదు. నాకు బాగా పరిచయం ఉన్నటువంటి ఒక ఉన్నత కుటుంబానికి చెందిన వారు , ఎవరైనా చెడ్డవాళ్ళు అని చెప్పడానికి ఒక మాట ఉపయోగించే వాళ్ళు. మనిషి తెలుపు కాని గుణం నలుపు అని.
ఇందులో చెప్పకనే వాళ్ళ ఉద్దేశ్యం అర్థం అయ్యేది. వారికి మనిషి రంగు తెలుపు కావాలి ,గుణం తెలుపు కావాలి అని. ఒక్కటి నాకు స్ఫష్టంగా తెలిసింది. వీళ్ళు తమ కంట్లో ఉన్నట్టి దూలాన్ని గురించి ఆలోచించకుండా ఎదుటు వాళ్ళ కంట్లో ఉన్నట్టి నలుసు గురించి ఎక్కువ చెప్పుకునే వాళ్ళు అని. ఇటువంటి ఎన్నో విషయాలు నన్ను కొంతమేర ప్రభావితం చేయగలిగాయి. నేను అందగాన్ని కాకపోయినా అందవిహీనున్ని మాత్రం కాదు. ఇదే సమయంలో నేను అందరు నన్ను ఇష్ట పడాలి అంటే నేను అందంగా వుండాలి అని నిర్ణయించుకున్నాను. అందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాను. ఐతే ఒక సమస్య. ఈ అందం ఎన్నాళ్ళు వుంటుంది. ? పాతికేళ్ళ వయసు దాక ? లేక ముప్పై ఇంకా ఎక్కువ అంటే ముప్పై ఐదు. మరి ఆ తర్వాత ?

అందం అనేది వయసుకు విలోమానుపాతంలో వుంటుంది.
వయసు పెరిగే కొద్దీ అందం తరుగుతుంది.

మరి తరగని సౌందర్యం ఏదైనా ఉందా అని ఎంతో అన్వేషించాను.
ఈ సమయంలో నేను ఎందుకు అందం గురించి ఎందుకు ఇంతగా ఆరాటపడుతున్నా అని ప్రశ్నించుకున్నా.
ఒకటే సమాధానం.
నన్ను అందరు ఇష్టపడాలి . ఇది నా ఒక్కడి సమస్య కాదు. దాదాపుగా అందరికి ఇలాంటి సమస్య వుంటుంది అని అనిపించింది.

అయితే ఇందులో నా స్వార్థం తెలిసింది.

నన్ను ఇష్ట పడాలి అనే స్వార్థం .
మనిషికి స్వార్థం అనేది స్వనాశనానికి ప్రధాన ఆయుధం.
నా స్వార్థం వదిలి పెట్టాను.
వీలైతే ఇతరులకి సహాయం చేయడం ప్రారంభించాను . అయితే ఇది వారి నుండి నాకు సహాయం కలుగుతుంది అనే స్వార్థంతో మాత్రం కాదు. ప్రారంభించాను ఒకరు ,ఇద్దరు, ముగ్గురు , పది, ఇరవై మందికి అలా చేయడం మొదలు పెట్టాను.
కొద్ది మంది దీన్ని అవకాశంగా తీసుకుని అవసరానికి వాడుకుని తర్వాత నిర్లక్ష్యం చేసినవారు లేకపోలేదు. ఐతే ఇందులో కష్టం కన్నా సంతోషం ఎక్కువ వుండేది. నేను నలుగురికి సహాయం చేయగలుగుతున్నాను అని. నా వాళ్ళ నలుగురికి ఉపయోగం వుంది అని.
అలా నాకు తెలియకుండా నన్ను ఇష్టపడే వాళ్ళు ,నన్ను అభిమానించే వాళ్ళు , నాతో స్నేహం కోసం ఆరాటపడేవాళ్ళు పెరిగిపోయారు.
ఒకసారి తిరుపతిలో చదువుకునే రోజుల్లో నా స్నేహితుడు నన్ను తన మాతృమూర్తి కి పరిచయం చేస్తూ అన్నమాట నేను ఎన్నటికి మరువను. నన్ను తన ప్రాణ స్నేహితుడిగా అభివర్ణించడం. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. నిస్వార్థమైన ,నిష్కల్మషమైన స్నేహానికి లభించిన ఒక చిన్న బిరుదు. ఏదో పొందానన్న ఆనందం నాకు ఆరోజు అనిపించింది. ఇది నాకు ఒక ఉత్ప్రేరకంగా పని చేసింది . అలా మొదలైంది , మిత్రులు, స్నేహితులు, బంధువులు, అందరికి నేనంటే అభిమానం నాకు తెలియకుండానే పెరిగి పోయింది . కొన్నిసార్లు నాకు అనిపించేది నిజంగా నన్ను పొగడుతున్న అంత గొప్ప వాడినా నేను అని. బహుశా కాకపోవచ్చు.

ఒక్కసారి వెనక్కి వెళ్లి ప్రశ్నించుకున్నాను నాకుగా, నేను కోరుకున్నది ఏమిటి అని ?
అందరు నన్ను ఇష్టపడాలి అని , దానికి అందం , సౌందర్యం కావాలి అని.
అంటే నేను అవి సంపాదించానా ? అవును ఐతే ఇది నాకు తెలిసిన బాహ్య సౌందర్యం కాదు.
కనిపించని అంతః సౌందర్యం అని .
ఈ అంతః సౌందర్యం వయసుతో పాటు పెరిగేది కాని తరిగేది కాదు అని. బాహ్య సౌందర్యం కొరకు మొహానికి పౌడర్ రాసుకున్నట్టు, ఈ అంతః సౌందర్యం కొరకు అప్పుడప్పుడు నలుగురికి సహాయం చేస్తే చాలు. కష్టాల్లో ఉన్న వారికి చేయూత ఇవ్వగలిగితే అందులో మనకు లభించే ఆనందం, తృప్తి, కోటి రూపాయలు మన సొంతం అయినప్పుడు పొందే దానికన్నా ఎన్నో రెట్లు ఎక్కువ.
అవకాశవాదులు అలుసుగా తీసుకున్నారు కొన్ని సార్లు అనే బాధ వున్నా నా కష్టాన్ని తమ కష్టంగా , నా సుఖాన్ని తమ సంతోషంగా భావించే నా అనే ఎందఱో నా వాళ్ళను చూస్తున్నప్పుదు
,
ఈ భాద సముద్రంలో కేవలం ఒక బిందువు లా అని పించేది.
ఇది నిజమైన
సౌందర్య కిటుకు. జీవితం నేర్పిన , నేర్పిస్తున్న ఒక సౌందర్య చిట్కా.
మన అలావాట్లే మన సౌందర్యాన్ని ప్రతిబిమ్భిస్తాయి అవి చెడ్డవైనా , మంచివైనా... మంచి అలవాట్లతో, లక్షణాలతో మనం పొందే ఈ అంతః సౌందర్యం ముందు, ఎంత గొప్ప బాహ్య సౌందర్యం అయినా దిగదుడుపే.
నా అనే వాళ్ళు నాకు ఎవరు లేరు, నన్ను ఇష్ట పడేవాళ్ళు ఎవరు లేరు అని కుమిలిపోతూ ,నిరాశ పడేవారికి , తమ జీవితాలు నాశనం చేసుకోవడానికి ప్రయత్నించే వారికి ఇది అమృతం కాకపోయినా, సంజీవని మూలిక కాకపోయినా, కనీసం ఒక సారి ఆలోచింపచేస్తుంది అనే ఒక ఆశ.

శారీరక అందం కొరకు ఆరాట పడుతూ అంతః సౌందర్యాన్ని కోల్పోతున్న మిత్రులకు,సోదర సోదరీమణులకు, ఈ నా చిన్న చిట్కా సహాయ పడుతుందనే ఒక చిన్న ప్రయత్నం. నిరాశలో ఉన్నట్టి సమయంలో ,
నన్ను ప్రోత్స హించిన వారికి హృదయపూర్వక కృతజ్ఞలతో.

-- మీ పాల్ నవీన్ .
బహ్రెయిన్.





No comments: